కోనసీమ తీపి గుర్తు.. ఆకట్టుకుంటున్న తాపేశ్వరం కాజా

రుచి చూడగానే ..జిహ్వకు వహ్వా అనిపించే తియ్యదనంతో… తేనెలూరించే తాపేశ్వరం మడతకాజా గతంలో జిల్లాకు మాత్రమే పరిచయం. ప్రస్తుతం దీని ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. అందరికీ తీపిగుర్తుగా తాపేశ్వరం కాజా నిలిచిపోయింది. 

Tapeswaram Kaja

మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి కాజా. దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది తాపేశ్వరం కాజాగా ప్రసిద్ధి చెందింది. తాపేశ్వరం కాజా అంటే తెలియని వారుండరు. ఇది ఖడాంతర ఖ్యాతి నార్జించింది. తాపేశ్వరం కాజాను మొట్ట మొదటిగా కనిపెట్టి, తయారు చేసింది పోలిశెట్టి సత్తిరాజు. కె.గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామానికి చెందిన సత్తిరాజు 80 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తన కుటుంబ సభ్యులతో తాపేశ్వరం వలస వచ్చి చిరుద్యోగం చేసేవారు. అనంతరం చిన్న హోటల్‌లో మిఠాయిలను చేసి అమ్మేవారు. అప్పట్లో ప్రత్యేక స్వీట్లు తయారు చేయాలన్న తలంపుతో మైదాపిండితో మడతలను పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి, పంచదార పాకం పెట్టి అమ్మేవారు. ఆ కాజాకు తక్కువ కాలంలోనే ఎంతో పేరు వచ్చింది. దాంతో తాపేశ్వరం కాజా రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందింది. తాపేశ్వరం నుంచి కర్ణాటక, ఢిల్లీ, మహరాష్ట్ర, తమిళనాడు, మొదలైన రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

Tapeswaram Kaja Making

శుభకార్యాల్లో తాపేశ్వరం కాజాకు చోటు
శుభకార్యాల్లో తాపేశ్వరం కాజా చోటు చేసుకుంది. 50 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ బరువు ఉండేలా రకరకాల సైజుల్లో వీటిని తయారు చేస్తారు. 1990లో సత్తిరాజు మరణించాక ఆయన వారసులు ఈ వ్యాపారాన్ని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం మొదలు పెట్టారు. కాజా తయారీలో యంత్రాలను ప్రవేశపెట్టి తయారీని సులభతరం, వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయ సినీప్రముఖులు ఇంట ఏదైనా శుభకార్యాలు లేదా మరేదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే తాపేశ్వరం కాజా తప్పకుండా ఉంటుంది. రాష్ట్రంలో తాపేశ్వరం పేరుతో పలు పట్టణాల్లో 300 వరకూ స్వీటుస్టాళ్లు ఉన్నాయి. ఇదంతా సత్తిరాజు చలవేనని వారంతా చెప్పుకుంటూ ఉండటం విశేషం. సత్తిరాజు కుటుంబంలో వారంతా ఇదే వ్యాపారంలో స్థిరపడ్డారు. కాజా సృష్టికర్త సత్తిరాజు చనిపోయి రెండు దశాబ్దాలు కావస్తున్నా ఆయన తయారు చేసిన వంటకం అందరి మదిలో తీపిగుర్తుగా చెరగని ముద్రవేసింది.

Tapeswaram Kaja , Madatha Kaja Making