జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 215వ జయంతి…. నేడు

గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే , గోదావరి డెల్టా వ్యవస్థను అన్నపూర్ణగ మలిచిన అపర భాగీరదుడు జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 215 వ జయంతి…. నేడు.

Sir Arthur Cotton

గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరధుడు నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు,
“కాటన్ దొర” అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి నేడు ( మే 15 (1803.) )

పవిత్ర గోదావరి జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్దివరకు గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ త్రాగటానికి నీళ్ళులేవు. ఒక ఏడు అతివృష్టి, మరొక ఏడు అనావృష్టి. ఏటా గోదావరి వరదలు చేసే బీభత్సం. 1854 వరకూ గోదావరి ప్రజలు పడ్డ యిక్కట్లు యిన్నీ అన్నీ కాదు. నేడు ఉభయగోదావరి ప్రజలు పచ్చ పచ్చగా ఉండటానికీ, తెల్లబట్టలు ధరించటానికీ, సుష్టుగా భోంచేయటానికీ వెనుక పెద్ద గాధ ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే గోదావరిని అదుపులోపెట్టి, ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చటానికి మూలపురుషుడు సర్ ఆర్ధర్ కాటన్. ఆయన కేవలం గోదావరి ప్రజలకే గాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు.

గోదావరి డెల్టా 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు.

Cotton museum dhavalesvaram

పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి తెలంగాణాలో ప్రవహిస్తే భద్రాచలం వద్ద గోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్నది. నాడు యీ జిల్లా పేరు గోదావరి కాదు. రాజమండ్రి పాపికొండల మధ్య ప్రవహించి, ధవళేశ్వరం వద్ద రెండుగా చీలి, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా ప్రవహిస్తున్న గోదావరిని ప్రజలు అనాదిగా పూజించారు. పవిత్రంగా చూశారేగాని, నిస్సహాయంగానే ఉండిపోయారు. 1831లో అతివృష్టి,1832లో తుఫాను వచ్చి అల్లకల్లోలం చేయగా 1833లో గుంటూరు కరువు వచ్చి ప్రజల్ని మాడ్చేసింది. ఆ కరువులో తాళలేక గోదావరి-ప్రజల్లో చాలామంది మూటాముల్లె కట్టుకొని దక్షిణాదికి తరలివెళ్ళారు. ఉన్నవారు లేనివారినే తరతమ భేదం లేకుండా సాగిన యీ ప్రయాణాల్లో జిల్లా మొత్తం మీద ప్రతి నలుగురిలో ఒక్కరు గతించారు. ఎంత దారుణమైన కరువంటే ఆడపిల్లల్ని కొందరు హైదరాబాద్ కు అమ్ముకున్నారు. ఊళ్లోగుండా ధాన్యం పోవాలంటే పోలీస్ బందోబస్తుతో తప్ప సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం ఏదో పేరుకి చెరువులు త్రవించే పనులు చేయించినా అవి అంతగా ఉపకరించలేదు. రోడ్లన్నీ శ్మశానాలుగా మారిన నాటి దృశ్యాలు బ్రిటిష్ చరిత్రకారులు సైతం ప్రస్తావించక తప్పలేదు. (మోరిస్ వ్రాసిన హిస్టరీ ఆఫ్ గోదావరి చూడండి.) ఈ కరువునుండి కొంచెం తేరుకునేసరికి 1839లో మళ్ళీ పెనుతుఫాను వచ్చి దెబ్బతీసింది.

Godavari Dowleswaram Barrage

గోదావరి ప్రాంతంలో నాడు ప్రత్తి విరివిగా పండించేవారు. మిల్లులు స్థాపించారు. కాని యింతకంటే చౌకగా బట్టలు ఉత్పత్తిచేసే పద్ధతుల్ని బ్రిటిష్ వారు కనుగొన్నందున యిక్కడ మిల్లులు మూతపడ్డాయి. దీనితో ప్రత్తి జీవనాధారంగా కూడా పోయింది. అంతవరకు మిల్లులపై ఆధారపడేవారు కూడా భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. భూముల ఫలసాయం దైవాధీనంగా ఉన్నది. జిల్లాలో ప్రభుత్వాదాయం కూడా క్షీణించింది. ప్రజలు క్షీణించారు. 1821 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,38,308 అయితే, రెండు దశాబ్దాల తరువాత 1841 లెక్కల ప్రకారం 5,61,041 అని తేలింది. దీన్ని బట్టి కరువుల బారికి ఎందరు గురైనారో వూహించవచ్చు. గ్రామాల్లో అమరకపు వ్యవసాయ పద్ధతి ననుసరించి, భూమి అంతా ఎవరో ఒక పెద్దమనిషి స్వీకరించి, కౌళ్ళకిచ్చి శిస్తు వసూలు గావించి ప్రభుత్వానికి యిస్తుండేవారు. అందుకెవరూ సాహసించటం లేదు. తహసిల్దారు బలవంతముగా ఎవరో ఒకరికి అంట గడుతుండేవాడు.

ఆ పరిస్థితిని పరిశీలించమని మద్రాసునుండి మౌంట్ మోరి అనే అతన్ని పంపించారు. నన్ను కాదని ఎవరినో పంపిస్తారా అని నాటి బ్రిటిష్ కలెక్టర్ కినుక వహించి అతనికి సహకరించలేదు. అయినా మౌంట్ మోరి పరిస్థితి చూచి ప్రభుత్వానికి నివేదించాడు. ఇది 1844 నాటి గాధ. ప్రభుత్వం కళ్ళు తెరిచింది. కరువు నివారణకై ఏం చేయాలో ఆలోచించసాగింది.

Arthur_Cotton

అట్లాంటి దారుణ పరిస్థితిలో సర్ ఆర్థర్ కాటన్ వచ్చాడు. అతను అప్పటికే కావేరి నదిని మళ్ళించి తంజావూరు ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు. అనారోగ్య కారణంగా విశాఖపట్టణంలో చర్చి నిర్మాణం వంటి తేలిక పనులు చేస్తున్నాడు. ప్రభుత్వ కోరికపై గోదావరినది ప్రాంతమంతా సర్వే చేశాడు. సుదీర్ఘమైన నివేదిక సిద్ధం చేశాడు, ఘాటైన మాటలతో ప్రభుత్వాన్ని ఎత్తిపొడిచాడు. సైన్సు, నాగరికత వున్నదనుకొనే బ్రిటిష్ వారు పరిపాలిస్తూ కూడా ప్రజల్ని యీi విధంగా ఉంచడం, నీటిని సద్వినియోగం చేసుకునేటందుకు తోడ్పడకపోవడం గర్హనీయమన్నాడు. అప్పటికీ 40 సంవత్సరాలుగా బ్రిటిష్ వారు గోదావరి ప్రజల సంకటస్థితిని చూస్తూ మిన్నకుండడం క్షంతవ్యం కాదన్నాడు. గోదావరి ప్రాంతమంతా చెరకు పండిస్తే ఎగుమతులు పెరుగుతాయనీ, ప్రజల ఆదాయం ప్రభుత్వాదాయం పెరిగి ఉభయ కుశలోపరిగా ఉండొచ్చన్నాడు. 1845 ఏప్రిల్ 17న తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాడు. తదనుగుణంగా గోదావరికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించడం ముఖ్యం. వరదల బారినుండి పంటల్ని కాపాడటానికి కరకట్టలు వేయటం, పంటలకు ప్రయాణాలకు తోడ్పడే కాలువలు త్రవ్వటం, మురుకినీటిపారుదల సౌకర్యాలు అమర్చటం, ధాన్యం రవాణా దృష్ట్యా అవసరమైన రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించటం తక్షణ కర్తవ్యాలన్నారు. దీనివలన ఎంత ఖర్చు అయ్యేదీ, ఏ విధంగా ఆదాయం వచ్చేదీ అంచనా వేసి చూపాడు. మొత్తం ఖర్చు 1,20,000 పౌండ్లు కాగా, ఒక్క ఆనకట్ట వరకూ 45,575 పౌండ్లు అవుతుందన్నాడు, నాటి పౌండు విలువ పది రూపాయలు. కాటన్ నివేదికను ఇండియాలోనూ, ఇంగ్లండులోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్లాగైతేనేమి అతని పథకాన్ని ఆమోదించారు.

Arthur Cotton Barrage

 

గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పని 1847లో ప్రారంభమైంది. కాటన్ ఛీఫ్ ఇంజనీరుగా పనిచేపట్టి, ధవళేశ్వరం వద్ద యిల్లు వేసుకొని నిర్విరామ కృషి చేశాడు. పనివారంతా అతన్ని “సన్యాసి” అనేవారు. నిష్కామకర్మగా అతను చేస్తున్న పనినిబట్టి వారట్లా పిలిచేవారు. 1847లో ఆనకట్ట ప్రారంభించినది మెదలు 1850 వరకూ 30,54,413 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. రోజుకు సగటున 2500 నుండి 3500 మంది కూలీలు ఉండేవారు. ఆనకట్ట నిర్మాణం ప్రారంభించినది మొదలు కాటన్ కు ప్రభుత్వ తోడ్పాటు అంత ఉత్సాహకరంగాలేదు. సర్వేకుగాను ఒక వెయ్యి పౌండ్లు యిచ్చారు. తొలుత ఆరుగురు ఆఫీసర్లనడిగితే ముగ్గురినే యిచ్చి సరిపెట్టుకొమ్మన్నారు. అదీ అనుభవంలేని వారిని పంపించారు. కాటన్ మెదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు ఇక్కడ కూలీలచేత పని త్వరగా చేయించవచ్చు, సంవత్సరానికి ఆరు మాసాలు నిర్విఘ్నంగా ఆనకట్టపని సాగించవచ్చు. ఆనకట్టతో పాటు వెన్వెంటనే కాలువల త్రవ్వకం సాగితే గాని,ప్రజలకు ఉపయోగం జరగదు. రైళ్ళపై డబ్బు తగలేసే కంటే, నీటివనరులపై ఆ డబ్బు వినియోగిస్తే అటు రవాణాకు యిటు భూమి అభివృద్ధికీ ఉపయోగపడుతుంది కనుక ఒక లక్ష పౌండ్ల చొప్పున ఐదేళ్ళపాటు వరుస డబ్బు మంజూరు చేస్తే పనంతా పూర్తి అవుతుంది. ఫలితం ఆశాజనకంగా వుంటుంది, అంటే ప్రభుత్వం పెడచెవిని బెట్టింది.

మొత్తం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి గావటానికి 27 సంవత్సరాలు పట్టింది. ఈలోగా అంచనాలు తారుమారయ్యేవి. కూలీ ధర పెరిగింది. ఇట్లా అంటీ అంటనట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది.

ఆర్థర్ కాటన్ మాత్రం పట్టుదలతో ఆనకట్ట పని పూర్తి గావించాడు. అప్పుడే ఒక ఏడాది ప్రాయంలో కుమార్తె చనిపోయింది. ఇంట్లోకి ఎప్పుడూ పాములు వస్తుండేవి. గుట్టలు ప్రేల్చుతుంటే రాళ్ళు యింటి మీద పడుతుండేవి. ఆరోగ్యం అంతంతమాత్రంగాగల కాటన్ ఎండలకి తట్టుకోలేక పోయాడు. ఎండదెబ్బ అతన్ని మంచాన పడేసింది. సెలవుబెట్టి, బాధతో కొన్నాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. తాను వెడుతూ ఓర్ అనే సమర్ధుడైన ఇంజనీరుకు పని అప్పగించి వెళ్ళాడు.

కాటన్ ఉండగానే, 1849లో పెద్ద వరద వచ్చింది. గంటకు 18 అంగుళాల చొప్పున నది పొంగింది. దానితోపాటు సుడిగాలి వచ్చింది. ఆ దెబ్బతో మొత్తం ఆనకట్ట కొట్టుకపోయిందనే భయపడ్డారు, 22 గజాలు గండిపడి ఆ మేరకు కట్ట కొట్టుకుపోయింది. మరొకచోట 44 గజాల గండిపడింది.అయితే వర్షాకాలం ముమ్మరంగా రాకమునుపే ఆ గండ్లు పూడ్చి ఆనకట్టను నిలబెట్టగలిగారు. మొదటి ఐదేళ్ళు లాకులపై ఖర్చు అవసరం లేకుండా పోయింది రిపేర్లు కూడా అక్కరబడలేదు. ఆనకట్టవద్ద కావలసినంత క్వారీ రాయి లభించటం, అడవులనుండి పెద్ద దూలాలు దొరకటం, యిట్లాంటి సౌకర్యాలన్నీ కాటన్ బాగా సద్వినియోగపరుచుకున్నాడు.

చేసిన పని సక్రమంగా ఉపయోగపడే నిమిత్తం, శిక్షణపొందిన నిపుణులను శాశ్వతంగా నియమించమని కాటన్ అభ్యర్ధించాడు. 1854 నాటికి ఆనకట్ట పని పూర్తి అయింది. కాటన్ సంతృప్తిపడ్డాడు. గోదావరి ప్రజలు మళ్ళీ తలెత్తుకున్నారు. ఆదాయం పెరిగింది. జనాభా పెరగజొచ్చింది. ప్రభుత్వం కూడా తృప్తిపడింది. కాలువలన్నీ త్రవ్వక పూర్వపు మాట యిదంతా.

steam-boiler
స్థూలంగాచూస్తే ఆనకట్ట పూర్తి అయిన తరువాత ఏడు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. జిల్లా ఆదాయం 2,30,000 నుండి 5,70,000కి పెరిగింది. ఎగుమతులు 60,000 నుండి 80,000 పెరిగాయి. 1852లో నరసాపూర్, అత్తిలి కాలువ త్రవ్వగా ఆ ఒక్క కాలువక్రిందే, 13 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. 1855 నుండీ గోదావరి ప్రజలు ఖచ్చితంగా చదువులకు సెన్సు చెల్లిసూ వచ్చారు. ఇట్లా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం డెల్టా ప్రాంతాన్నంతటినీ సాగులోకి తెచ్చే ప్రయత్నం వెంటనే తలపెట్టలేదు బ్రిటిష్ ప్రభుత్వం.

1860లో కాటన్ రిటైర్ అయ్యాడు. 1859లో జిల్లా పరిపాలనలో మార్పులు జరిగాయి. రాజమండ్రి జిల్లా కోస్తా గోదావరి జిల్లాగా మారింది. ఉభయగోదావరులింకా రాలేదు. 1857 సిపాయి తిరుగుబాటు సమయంలో విధ్వంసక చర్యలు జరుగుతాయని, ఆనకట్టలు పాడుచేస్తారని భావించారు. కాటన్ దక్షిణాదిలో బ్రిడ్జిలు, ఆనకట్టలు తనిఖీచేస్తూ ఉండేవాడు కాని దక్షిణాదిన సిపాయి తిరుగుబాటు ప్రభావం లేకుండాపోయింది. కాటన్ ఇంగ్లండు వెళ్ళిపోయాడు. కథ యింతటితో ముగియాల్సింది. అప్పుడు సుఖాంతంగా ఉండేది. అట్లా జరగలేదు.

కాటన్ మొదటినుండీ ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతదేశానికి రైళ్ల కంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని ,కాలువలు పంటలకూ,ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారంతా ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాల నివ్వలేదని, దండుగ మారివనీ, కనుక విచారణ జరగాలన్నారు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది.
ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. సర్ జార్జి కాంప్ బెల్ వంటివారు కాటన్ వ్యతిరేకత బాగా చూపారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వాదోపవాదలకు సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది.

రైలుమార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపారు.

గోదావరి డెల్టా పితామహుడు
దేశీయుల ఆదరాభిమానాలకు మన్ననలకు కాటన్ పాత్రుడయ్యాడు,యివి కేవలం పొగడ్తలు కాదు. కాటన్ ఆచరణలో దేశీయులపై ఉంచిన నమ్మకం, వారిచే పనిచేయించుకున్న తీరు, పల్లకి ఎక్కిన ప్రభువువలెగాక, తానూ ఒక కూలీగా అందరితో కలసి కష్టించిన ఫలితంగా ఆయనకు ఆదరణ లభించింది. వీణం వీరన్నవంటి ఓవర్సీర్లు కాటన్ కు లభించారు. వీరన్న తరువాత సబ్-ఇంజనీరుగా పైకివచ్చాడు. రాయ్ బహదూర్ బిరుదు పొందాడు. కాటన్ కు సహకరించి పనులు జరగటానికి తోడ్పడ్డాడు. ఆనకట్టపై ఒకచోట అతని పేరిట ఫలకం ఉన్నది. 1867లో వీరన్న చనిపోయాడు.
1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి.

వీటన్నిటి దృష్ట్యా నాటి గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు “గోదావరి డెల్టా పితామహు”డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు. రిటైర్ అయిన తరువాత 1863లో మరొక్కసారి కాటన్ ఇండియా వచ్చి వెళ్ళాడు.

1899 జులై 14న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. భారతదేశ బంధువుగా చిరస్మరణీయుడైన కాటన్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా వరిత్రకెక్కాడు. ప్రజల దీనావస్థ కళ్ళారా చూచి, తెలుపు నలుపు అనే రంగు బేధం లేకుండా, మానవతాదృక్పధంతొ ఆచరణకు ఉపక్రమించిన మానవతావాది కాటన్. అందుకనే ఆయన నాటికీ, నేటికీ ఆదర్శప్రాయుడు. వృధాగా పోతున్న నీటిని ప్రవహించే బంగారంగా మార్చిన కాటన్ ముందుచూపు గమనార్హమైనది.

కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియంఆవరణమీదుగా, మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉంది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినదిరాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍సైజు విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు. విచారించదగ్గ విషయమేమంటే, ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి

 Source : MPPUPSchool,thandavapalli,East Godavari.